henley and partners: అత్యధిక కోటీశ్వరులు ఉండే టాప్ 50 సిటీస్ లో రెండు ఇండియాలోనే!

  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న 58,800 మంది మిలియనీర్లు
  • దేశ రాజధాని ఢిల్లీలో 30,700 మంది నివాసం
  • అత్యధికంగా 3,49,500 మంది కోటీశ్వరులతో తొలి స్థానంలో నిలిచిన న్యూయార్క్ సిటీ
Worlds Wealthiest Cities Report 2024

ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్య, వారి సంపద విలువపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తాజాగా సర్వే చేపట్టింది. ఈ అధ్యయన వివరాలతో కోటీశ్వరులు (సుమారు రూ. 8 కోట్లు), శత కోటీశ్వరులు సుమారు (రూ. 800 కోట్లు), అపర కుబేరులు (రూ. 8,000 కోట్లు) ఉంటున్న టాప్ 50 నగరాల జాబితాను విడుదల చేసింది. 

ఈ లిస్ట్ లోని 50 నగరాల్లో అమెరికాకు చెందన ఏకంగా 11 నగరాలకు చోటు లభించడం విశేషం. అత్యధికంగా న్యూయార్క్ నగరంలో 3,49,500 మంది కోటీశ్వరులు నివసిస్తున్నట్లు నివేదిక తెలిపింది.  గత పదేళ్లతో పోలిస్తే అక్కడ నివసిస్తున్న వారి సంఖ్య 48 శాతం పెరిగింది. న్యూయార్క్ నగరంలోని సుమారు 82 లక్షల మందికిగాను ప్రతి 24 మందిలో ఒకరు ఏడంకెల ఆస్తిపరులు. 2013లో ప్రతి 36లో ఒకరు మాత్రమే అంత సంపదపరులు ఉండేవారు. అలాగే న్యూయార్క్ లో 60 మంది శత కోటీశ్వరులు, 744 మంది అపర కుబేరులు ఉన్నారు. 

తాజాగా ఈ జాబితాలో భారత్ లోని ముంబై, ఢిల్లీ నగరాలకు చోటుదక్కింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 58,800 మంది కోటీశ్వరులు, 236 మంది శత కోటీశ్వరులు, 29 మంది అపర కుబేరులు నివసిస్తున్నట్లు నివేదిక తేల్చింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 30,700 మంది మిలియనీర్లు, 123 మంది సెంటీ మిలియనీర్లు, 16 మంది బిలియనీర్లు ఉన్నారు. 2013తో పోలిస్తే ముంబైలో మిలియనీర్ల వృద్ధి రేటు 82 శాతం పెరగ్గా, ఢిల్లీలో కోటీశ్వరుల వృద్ధి రేటు ఏకంగా 95 శాతం పెరిగింది. గ్లోబల్ మిలియనీర్స్ ఇన్ సిటీస్ లిస్ట్ లో ముంబై 31వ స్థానంలో నిలవగా ఢిల్లీ 32వ స్థానంలో నిలిచింది..

చైనాలోని ప్రధాన నగరాల్లో కోటీశ్వరుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ తమ అధ్యయనంలో గుర్తించింది. 50,300 మంది కోటీశ్వరులు, 154 మంది శతకోటీశ్వరులు, 22 మంది అపర కుబేరులతో షెంజెన్ నగరంలో గత పదేళ్లతో పోలిస్తే ఏకంగా 140 శాతం మిలియనీర్ల వృద్ధి రేటు పెరిగింది. అలాగే హాంగ్ జౌ, గ్వాంగ్ జౌ నగరాల్లోనూ మిలియనీర్ల సంఖ్య వరుసగా 125 శాతం, 11‌‌0 శాతం పెరిగినట్లు అధ్యయనం తేల్చింది. అయితే జపాన్ లోని టోక్యో, ఒసాకా నగరాల్లో నివసించే మిలియనీర్ల సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే తగ్గినట్లు సర్వే వెల్లడించడం గమనార్హం. 

  • Loading...

More Telugu News